నీలి నక్క
ఒక రాత్రి చండరవుడు అనే నక్క ఆకలితో ఆహారం వెతుక్కుంటూ ఊళ్ళోకి వచ్చింది. కుక్కలు దాన్ని తరిమాయి. అది నీలి రంగు నిండిన ఒక పెద్ద తొట్టిలోకి దూకేసింది.
అది బయటికి వచ్చేసరికి, ముక్కు నుంచి తోక దాకా నిగనిగలాడే నీలి రంగులోకి మారిపోయింది!
అది అడవికి తిరిగి వెళ్ళింది. అడవి జంతువులు ఇంతకు ముందు ఎప్పుడూ నీలి రంగు జంతువును చూడలేదు. “నువ్వు ఎవరు?” అని వణుకుతూ అడిగాయి.
నక్కకు ఒక ఆలోచన వచ్చింది. “మీకు రాజుగా ఉండమని దేవుళ్ళు నన్ను పంపారు,” అని గర్వంగా చెప్పింది. సింహాలు, పులులు, ఏనుగులు దానికి తల వంచి నమస్కరించాయి. మంచి మంచి ఆహారం తెచ్చి ఇచ్చాయి.
నీలి నక్కకు గర్వం బాగా పెరిగిపోయింది. మిగతా నక్కలు తనను గుర్తుపడతాయేమో అని భయపడి, వాటన్నిటినీ అడవి నుంచి వెళ్ళగొట్టింది.
ఒక సాయంత్రం, దూరంగా ఉన్న నక్కలు చంద్రుణ్ణి చూసి ఊళ వేయడం మొదలుపెట్టాయి. నీలి నక్కకు ఎంత సంతోషం వేసిందంటే, అది కూడా తల ఎత్తి ఊళ వేసింది: “ఊ-ఊ-ఊ-ఊ!”
అంతే! అది ఒట్టి నక్కే అని అందరికీ తెలిసిపోయింది. మోసపోయామని జంతువులకు చాలా కోపం వచ్చింది. నీలి నక్క అడవిని వదిలి శాశ్వతంగా పారిపోవలసి వచ్చింది.